హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): మోదీ సర్కార్ పౌర సమాజంపై క్రూరమైన దాడి చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్‌పాషా విమర్శించారు. మానవ హక్కుల రక్షణ కోసం పోరాడుతున్న తీస్తా సెతల్వాద్ అరెస్టును ఖండిస్తూ మంగళవారం సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నారాయణగూడ వైఎంసీఏ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు.
అజీజ్‌పాషా మాట్లాడుతూ తీస్తా సెతల్వాద్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విలువల కోసం పోరాడే తీస్తా సెతల్వాద్, ఆర్బీ శ్రీకుమార్‌ను అపహాస్యం చేసేందుకు వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ కూడా ఈ అరెస్టులను ఖండించడం మోదీ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి నాయకులు ఎం నరసింహ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.