హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి, 5 తర్వాత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.
మంగళ, బుధవారాల్లో నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నదని అంచనా వేసినట్టు వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వివరించింది. గడిచిన 24గంటల్లో నారాయణపేట జిల్లా మాగనూరులో అత్యధికంగా 3.13 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, కామారెడ్డి జిల్లా జుక్కల్లో 2.74 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.