హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును పెట్టకపోతే బీజేపీ భూస్థాపితం చేస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న హెచ్చరించారు. మనువాద నిచ్చెన మెట్ల సమాజంలో తమను వేల సంవత్సరాలుగా విద్యకు దూరం చేశారని ఆరోపించారు. మనువాద, మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగానే తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వేల సంవత్సరాల క్రితం తాము చదువుకుంటే ఓర్వకుండా తమ చెవుల్లో సీసాలు పోసి, తమను విద్యకు దూరం చేసిన మతోన్మాద మనువాదమే తమకు ప్రథమ శత్రువు అని పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ కోసం 28 సంవత్సరాలుగా అలుపెరగకుండా పోరాటం చేస్తున్నామని, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మాదిగలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కార్మిక, కర్షక ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా అనేక కఠిన నిర్ణయాలు, చట్టాలు చేసిందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థల్లో రిజర్వేషన్ ఎత్తేసే కుట్రకు తెరలేపి విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు కాకుండా చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిత్యం దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనువాదానికి మాదిగ వాదమే ప్రతివాదంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాగారం చిన్నబాబు, పొట్ట పెంజర రమేశ్, సలేంద్ర బాబురావు, మంచాల యాదగిరి, వరిగడ్డి చందు, ఎల్ నాగరాజు, మారపాక నరేందర్, గుమిడెల్లి తిరుమలేశ్, జన్నారపు జీవన్, కార్తీక్ తదితరులు ఉన్నారు.