హైదరాబాద్ : ‘మీరు చనిపోతే మీ భార్యలు ఏడవరా..?’ అని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు మండిపడ్డారు. వాళ్లు చనిపోతే వాళ్ల భార్యలు ఏడుస్తారో లేదో మంత్రులే చెప్పాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో మంత్రులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నులో వణుకుపుడుతోందని అన్నారు.
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ మహిళా లోకాన్ని అవమానించే విధంగా, చిల్లరగా మాట్లాడారని తాతా మధు విమర్శించారు. ఇలాంటి నికృష్టమైన మంత్రులు తెలంగాణలో ఉండటం దురదృష్టకరమన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ చనిపోతే అందరూ సానుభూతి చూపారని, కానీ ఇలా నీచంగా మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్.. మేయర్ విజయలక్ష్మిని, విజయారెడ్డిని పక్కన పెట్టుకుని మాగంటి సునీతపై కామెంట్స్ చేశారని మధు మండిపడ్డారు. పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు.. రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరితపై గెలిచారని గుర్తుచేశారు. ఆడబిడ్డలు, భర్తలు చనిపోయిన వారిని అవమానించే విధంగా మంత్రులు మాట్లాడారని ఆరోపించారు. తెలంగాణ మహిళలకు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.