ఖమ్మం, అక్టోబర్ 30: వెయ్యిమంది రేవంత్‌రెడ్డిలు వచ్చినా తెలంగాణలో కేసీఆర్ చరిత్రను తుడిచివేయలేరని, తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ సజీవంగా నిలిచి ఉంటారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పష్టంచేశారు. బుధవారం ఖమ్మం లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్య మం అంటే ఏమిటో తెలియని రేవంత్.. కేసీఆర్ చరిత్రను లేకుండా చేయడమంటే.. తెలంగాణ రాష్ర్టాన్ని లేకుండా చేయడమేనని, ఒకవేళ తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతాడేమోనని అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్‌కు త్యాగాల గురించి ఏం తెలుసుని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసిన పోరాటం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన కృషి ఫలితంగానే తెలంగాణ ప్రజలపై రూ.18,500 కోట్ల విద్యుత్తు చార్జీల భారం పడకుండా ఆగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ 11 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు.