ఖైరతాబాద్, నవంబర్ 28: దేశంలోని సంచారజాతులు దుర్భరమైన స్థితిగతుల నుంచి బయటపడాలని, రాజ్యాధికారం దిశ గా అడుగులు వేయాలని శాసనమండలి పక్ష నేత, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. తెలంగాణ సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని ఓ సంపన్నుడి ఆస్తి కంటే సంచార జాతుల అందరి ఆస్తులు తక్కువగా ఉంటాయని తెలిపారు. సంచార జాతుల్లో 90 శాతం కులాలు చట్టసభల ముఖాలే చూడలేదని, అందులో కొందరికి చట్టసభలు ఉన్నాయన్న విషయమూ తెలియదని తెలిపారు. దేశజనాభాలో 12 శాతం ఉన్న సంచారజాతులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో ప్రభుత్వాలనే మార్చవచ్చని చెప్పారు. మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం కులగణన సర్వే సమయంలోనే సంచారజాతుల బాగోగుల గురించి ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటుచేసిందని, అత్యంత వెనుకబడిన వారికి సముచిత స్థానం కల్పించిందని గుర్తుచేశారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ చేపడుతున్న సమగ్ర కులగణనలో సంచార జాతులకు కాలమే లేదని, రాష్ట్రంలో వంద శాతం సమగ్ర కులగణన చేశామని ప్రభుత్వం ఎలా చెప్పుకుంటుందని ప్రశ్నించారు. సంచార జాతులను లెక్కించే వరకు అవసరమైతే ఆ వర్గాలతో పోరాటాలు నిర్వహిస్తామని చెప్పా రు. ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూ రి శ్రీనివాస్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ప్రొఫెసర్ తిరుమలి, ప్రొఫెసర్ మురళీ మనోహర్, తెలంగాణ రాష్ట్ర సంచారజాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఓ నరేందర్, విశ్రాంత డీఎస్పీ గంగాధర్, వివిధ సంఘాల నేతలు బత్తుల సిద్దేశ్వర్, పిడికిలి రాజు, వంశరాజ్, మురళీకృష్ణ, కోల శ్రీనివాస్, విశ్వేశ్వరయ్య, రమేశ్, రాములు తదితరులు పాల్గొన్నారు.