హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తేతెలంగాణ) : హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండగా కొత్తగా ప్రభుత్వం హైడ్రాను ఎందుకు తీసుకొస్తుందని ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ప్రశ్నించారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పేరుతో హైడ్రా ఏర్పాటుచేశామన్నారే కానీ, బిల్లులో హైడ్రా అని చెప్పలేదని పేర్కొన్నారు. కరోనాతో ప్రపంచమంతా ఎలా భయపడిందో.. హైడ్రాతో హైదరాబాద్ ప్రజలు అంతలా భయపడుతున్నట్టు చెప్పారు.
హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ శాఖలు అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత కట్టిన ఇండ్లను కూడా హైడ్రా కూల్చివేసిందని ఆందోళన వ్యక్తంచేశారు. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటి? అని ప్రశ్నించారు. హైడ్రాతో ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు కూల్చివేశారు? వాటికి బాధ్యత ప్రభుత్వం వహిస్తుందా? సీఎం వహిస్తారా? హైడ్రా కమిషనర్ వహిస్తారా? అని ప్రశ్నించారు.
హైడ్రాతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిందని, దీంతో ఆ రంగంపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. పేదల ఇండ్లను మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి, సీఎం సోదరుడికి మాత్రం నోటీసులిచ్చి తప్పించడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో శివారు మున్సిపాల్టీలను కలిపి నగరాన్ని నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.