మహబూబాబాద్, ఆగష్టు 22 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకం ఆడుతుందని.. రైతులకు రుణమాఫీ చేశామని అబద్ధపు మాటలు చెబుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. గురువారం మానుకోట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రైతులందరికి ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులకు తీరని ద్రోహం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూర్యాపేట అర్బన్, ఆగస్టు 22 : తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తామన్న 49 వేల కోట్ల రుణమాఫీని వెంటనే చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీని గుర్తుచేసేందుకే రైతుల పక్షాన బీఆర్ఎస్ ధర్నాకు దిగిందని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రలోని వాణిజ్య భవన్ సెంటర్లో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయలేకనే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ ప్రజలను బహిరంగంగానే మోసం చేసిందని విమర్శించారు. రుణమాఫీ ఎంత చేశారో చెప్పడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ , ఆగస్టు 22 : రూ.2 లక్షలు మాఫీ చేస్తామని ఇప్పుడు కొర్రీలు ఎందుకు పెడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాలమూరులో నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. రేవంత్ సర్కార్ బుర్ర కథలు చెప్పి.. రైతుల చెవుల్లో కాంగ్రెస్ నేతలు పూలు పెట్టారని ధ్వజమెత్తారు. 25 శాతం మందికి కూడా రుణమాఫీ కాలేదని, 75 శాతం మందికి ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి రైతులు ‘పాలిచ్చే బర్రెను విడిచిపెట్టి.. దున్నపోతులాంటి ప్రభుత్వాన్ని కొట్టంలో కట్టేసుకున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా కదంతొక్కి ప్రభుత్వం మెడలువంచి ఇచ్చిన హామీలు నెరవేర్చేలా పోరాడుతామని స్పష్టం చేశారు.
కరీంనగర్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఆగస్టు 15 లోగా 2లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్టేసి రైతులను దగా చేశాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. అనేక కొర్రీలు పెట్టి వేలాది మందికి ఎగనామం పెట్టారని ఆరోపించారు. వెంటనే షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల నేతృత్వంలో రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాల కోరు అని, మోసపూరిత మాటల్లో ఆరితేరిండని మండిపడ్డారు.
ఖమ్మం, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చివరి రైతు వరకూ రుణం మాఫీ జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హెచ్చరించారు. ఖమ్మంలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీపై అనేక ఆంక్షలు పెట్టి రైతులను మోసగించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసేయాలన్నారు.
ఆదిలాబాద్, ఆగస్టు 22: రెండు లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేశాడని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఆదిలాబాద్‌లో జరిగిన రైతు ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులపై ప్రేమ కనపరిచి అధికారంలోకి తర్వాత గాలికి వదిలేసిందని ఆరోపించారు. రుణమాఫీ విషయంలో రైతుల ఆందోళనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతులందరికీ బ్యాంక్‌లోన్ రద్దు అయ్యేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.