MLC Polls | హైదరాబాద్/నెట్వర్క్ (నమస్తే తెలంగాణ) ఫిబ్రవరి 27: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇందులో నల్లగొండ(నల్లగొండ-వరంగల్-ఖమ్మం) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 93.55 శాతంతో అత్యధికంగా పోలింగ్ నమోదయ్యింది. కరీంనగర్(కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్) ఉపాధ్యాయ స్థానంలో దాదాపు 91.90 శాతం నమోదయ్యింది. కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి దాదాపు 70.42 శాతం ఓటింగ్ జరిగినట్టు సీఈవో తెలంగాణ సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించినట్టు తెలిపారు. పలు పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 7 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. మార్చి 3న ఫలితాల లెక్కింపు జరగనుంది.
ఖమ్మం రిక్కాబజార్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతలు ఫ్లెక్సీలతో పెట్టడంతో యూటీఎఫ్ నాయకులు ఆందోళనకు దిగారు. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉపాధ్యాయ సంఘాలతో పాటు రాజకీయ నాయకులు పోటాపోటీగా ప్రచారం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ పరిధిలోని శ్రీరాంపూర్‌లో పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. మందమర్రి సింగరేణి పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. పోలీసులు తనిఖీలో డబ్బులు దొరకలేదు. దీంతో కాసేపు వాగ్వాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. పోలీసులు పట్టించుకోవడం లేదని వాగ్వాదానికి దిగారు.
డంపింగ్‌యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఓటింగ్‌ను బహిష్కరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పూల్నాయక్తండాకు చెందిన భూక్య కవిత అనే మహిళ ఓటును అధికారులు చూసుకోకుండా బోడ కవిత అనే మహిళతో వేయించారు. ఆ తర్వాత బోడ కవిత పేరు మీద భూక్య కవితతో ఓటు వేయించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో 2188 ఓట్లకు రెండే కేంద్రాలు ఏర్పాటు చేయడంతో గ్రాడ్యుయేట్లు ఇబ్బంది పడ్డారు.
కరీంనగర్‌కు చెందిన గ్రాడ్యుయేట్ శ్రీరామోజు అఖిల అమెరికా నుంచి వచ్చి సుభాష్‌నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఇండియా పర్యటన ప్లాన్ చేసుకున్నానని తెలిపారు. ఓటు వేసినందుకు ఆనందంగా ఉందని చెప్పారు.