పరకాల, డిసెంబర్ 21: సంవ్సతర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని అమలు చేయలేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. హనుమకొండ జిల్లా పరకాల లో పోచంపల్లి ట్రస్ట్ ద్వారా కుట్టుశిక్షణ పూర్తి చేసుకున్న 650 మహిళలకు శనివారం ఉచితంగా కుట్టుమిషన్లను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నిస్తే కుట్ర పూరితంగా కేసులు పెట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషిచేయాలని సూచించారు.