హుజూరాబాద్‌టౌన్, జూలై 30: ‘నీకు దమ్ముంటే, హు జూరాబాద్ ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి రూ.100 కోట్లు తీసుకురా.. నేను సీఎం కేసీఆర్‌తో మాట్లాడి రాష్ట్ర సర్కారు ద్వారా రూ.150 కోట్లు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరారు. తాను అభివృద్ధి గురించి మా ట్లాడితే ఈటల రాజకీయాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రిపై పోటిచేస్తా.. గెలుస్తా’ అంటూ బీరా లు పలకడం మాని ఆగస్టు 5న హుజూరాబాద్ అంబేద్కర్ సెంటర్లో అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. శనివారం రాత్రి హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని అంబేదర్ చౌరస్తా వద్ద తనతోపాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కే విజయ, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక చర్చకు వస్తారని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వం ఒక జీవో కూడా ఇవ్వలేదని ఈట ల అబద్ధాలు చెప్తున్నాడని, జీవో 354 ప్రకారం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎస్సీల అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈట ల హుజూరాబాద్‌లో ఉంటే యాక్టర్లా, హైదరాబాద్‌లో జోకర్లా, ఢిల్లీలో ఉన్నప్పుడు బ్రోకర్లా వ్యవహరిస్తాడని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక పాల్గొన్నారు.