హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ సంస్కృతిని తెలంగాణ తల్లి నుంచి వేరు చేసినందుకుగాను మహిళా లోకానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇటలీకి చెందిన సోనియాగాంధీకి బతుకమ్మ సంస్కృతీ, సంప్రదాయాలు తెలియకపోయినా, రాష్ట్ర నేతలకైనా సోయి ఉండాలి కదా? అని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ నేతలు సంజీవ్‌నాయక్, పల్లయ్య కురువతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆడబిడ్డల సంప్రదాయమైన బతుకమ్మ పండుగను కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని గుర్తుచేశారు.
ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం చీరలిచ్చి గౌరవించలేని పరిస్థితిలో ఉందని మండిపడ్డారు. చీరలు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించినందుకు.. అసలు బతుకమ్మనే లేదనేలా వ్యవహరించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ సంస్కృతిని అవమానపర్చిన వారికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను తీసేసి చేతిగుర్తుకు ఓటు వేయాలన్నట్టుగా అభయహస్తం పెట్టడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతి గురించి అవగాహన లేకనే కాంగ్రెస్ నాయకులు బతుకమ్మపై నోరుజారుతున్నారని, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బతుకమ్మ కించపరిచే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్‌కు తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ గురించి తెలియకపోతే భార్యలను అడగాలని సూచించారు. బతుకమ్మను కించపరిచేలా మాట్లాడడం కాంగ్రెస్ నాయకులకే చెల్లిందని విమర్శించారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడంపై ప్రొఫెసర్ కోదండరాం తన గౌరవాన్ని తగ్గించుకునేలా మాట్లాడారని విమర్శించారు. పదవులు వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతిని మరిచి, ఇటలీ సంస్కృతిని పాటిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సంస్కృతిపై విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు తెలంగాణలో తిరిగే హకు లేదని, ధోరణి మార్చుకోకపోతే ప్రజలే అడ్డుకుంటారని హెచ్చరించారు.