హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తమ 60 ఏండ్ల పాలనలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం చేతగాని కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ను విమర్శించే నైతిక అర్హత లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఒక్కరోజైనా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పట్టుబట్టారా అని నిలదీశారు. ‘నేను ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారికంగా ఆహ్వానం పంపాను. కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రతినిధి కూడా హాజరు కాలేదు.. కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదు’ అని ఆమె గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ గాడ్సే అని పిలుచుకొనే రేవంత్‌రెడ్డి.. మహిళా రిజర్వేషన్ల కోసం సోనియాగాంధీని, ప్రియాంక గాంధీని, ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
ట్విట్టర్ వేదికగా ఆమె రేవంత్‌పై ధ్వజమెత్తుతూ.. ఉత్తరప్రదేశ్‌లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని సొల్లుకబుర్లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఓడిపోయే సీట్లను మహిళలకు కేటాయించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కర్ణాటకలో మహిళలకు 15 సీట్లు కేటాయిస్తే వారిలో ముగ్గురే గెలిచారని, 18 మంది మంత్రులున్న ప్రభుత్వంలో ఒక్క మహిళకే అవకాశం ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో మహిళలకు దక్కుతున్న ప్రాధాన్యాన్ని పక్కనబెట్టి తెలంగాణలో మాత్రం రేవంత్ నీతులు చెబుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ తమ స్వార్ధపూరిత రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లును దశాబ్దాలుగా వాడుకుంటున్నదని విమర్శించారు. ఉద్యమకారుల మీద తుపాకీ ఎత్తిన రేవంత్‌రెడ్డికి మహిళా రిజర్వేషన్లపై చట్టం చేయాలనే తమ న్యాయమైన డిమాండ్‌పై వెకిలిగా వ్యవహరించటంలో వింతేమిలేదని అన్నారు. ఏ రాష్ట్రమైనా.. ఏ రాజకీయ పార్టీ అయినా మహిళలకు దకాల్సినన్ని స్థానాలు దకడం లేదన్నదే తమ ఆవేదన అని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో కలిసి రావాలని కోరారు.