హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘భారతీయులను కాపాడేందుకు ప్రాణాలొడ్డి పోరాడిన సైనికులకు వందనం.. ఈ పోరాటంలో అసువులు బాసిన భారత జవాన్లకు ఘనమైన నివాళి. అయితే విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం ఆశ్చర్యమనిపించింది.
మన ప్రధాని ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తే భారత గొప్పతనం మరింత ఇనుముడించేది. ఏదేమైనా కాల్పులు విరమణ శుభపరిణామం. సాధ్యమైనంత తొందరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించి భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తిరిగి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలి’ అని సూచించారు.