వరంగల్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కుంభమేళాను తలపించేలా జరగనుందని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా నేతలతో కలిసి సభా ప్రాంగణం పరిశీలించడానికి వచ్చామని వెల్లడించారు. సభా ప్రాంగణంలో మహిళల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తామని తెలిపారు. కాగా, ఎమ్మెల్సీ కవితతోపాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, పలువురు బీఆర్ఎస్ నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు.