హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా తొక్కిపెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. 2010లో రాజస్యభలో ఆమోదించిన బిల్లును లోక్‌సభలో పాస్ చేయకుండా తాత్సారం చేసిందని మండిపడ్డారు. బుధవారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది దేశవ్యాప్తంగా ఉన్న 70 కోట్ల మహిళల సమస్య అని పేర్కొన్నారు. మహిళలకు పార్లమెంట్, అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం ఎందుకు కల్పించడం లేదనే అంశంపై మాట్లాడకుండా బీఆర్ఎస్ మహిళలకు సీట్లు కేటాయించలేదనే అంశంపై చర్చ పెట్టడం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. రాజకీయ పార్టీలే మహిళలను ముందుకునెట్టి వారితో విమర్శలు చేయించడం, మహిళలకు వ్యతిరేకంగా మహిళలనే ప్రోత్సాహించడం, రిజర్వేషన్ అంశాన్ని పక్కదారి పట్టించడమేనని చెప్పారు.
70 ఏండ్లలో ఏదీ పురోగతి?
దేశంలో తొలిసారిగా నెహ్రూ క్యాబినెట్లో ఒక మహిళకు అవకాశం కల్పిస్తే.. మోదీ పాలనలో కేవలం ఇద్దరు మహిళలకే చోటు దక్కిందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తంచేశారు. 70 ఏండ్లలో ఒక్కరి నుంచి ఇద్దరయ్యారని సంతోషపడాలా? ఇన్నేండ్లలో కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చారని బాధపడాలా? అని ప్రశ్నించారు. తొలి పార్లమెంట్లో మహిళలు 4.5% ఉంటే.. ప్రస్తుతం 12.5 శాతానికి చేరిందని, ఇన్నేండ్లలో సాధించిన పురోగతి ఇదేనా? అని నిలదీశారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలుచేయడం లేదని విమర్శించారు. దీనిపై బీజేపీ నాయకులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. బీఆర్ఎస్లో మహిళలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. బిల్లు పెట్టిన కాంగ్రెస్ ఎందుకు ఆమోదించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో సోనియాగాంధీ ఎన్నిసార్లు ఆ బిల్లుపై మాట్లాడరని ప్రశ్నించారు. తాను జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తే మళ్లీ ఆ బిల్లు అందరికీ గుర్తొచ్చిందని చెప్పారు. ధర్నా చేసేటోళ్లను ప్రశ్నిస్తారా? బిల్లు పాస్ చేయనివారిని ప్రశ్నిస్తారా? కాంగ్రెస్, బీజేపీ నేతలే తేల్చుకోవాలని హితవు చెప్పారు.
మళ్లీ జంతర్‌మంతర్ వద్ద దీక్ష
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతోనే మహిళలకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, దీని కోసం మహిళాలోకమంతా పోరాటం చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. మళ్లీ పార్లమెంట్ సమావేశాలు జరిగితే జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేస్తామని చెప్పారు. ఢిల్లీలోని సోనియాగాంధీ, స్మృతిఇరానీ, ప్రియాంకాగాంధీ నుంచి తెలంగాణలోని డీకే అరుణ వరకూ అందరికీ ఆహ్వానాలు పంపుతామని తెలిపారు. ఎవరెవరు వస్తారో? ఎవరెవరు రారో? నీళ్లేవో, పాలేవో అప్పుడే తేలుతుందని వ్యాఖ్యానించారు. రెండుసార్లు బీజేపీ మ్యానిఫెస్టోలో మహిళా బిల్లుకు చోటు కల్పించినా.. ఇంతవరకు ఒక్క అడుగుముందుకు వేయలేదని ఎద్దేవా చేశారు.
ఈవీఎం ట్యాంపరింగ్‌పై అనుమానాలు
‘ఈసారి ఓటు ఎవరికి వేసినా.. అది వెళ్లేది బీజేపీకే’ అంటూ ఆ పార్టీ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలతో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారనే అనుమానం బలపడిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దీనిపై భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఒక సామాజికవర్గం వారిని ఉద్దేశించి ఓట్లు వేయవద్దని వ్యాఖ్యానించిన ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లీడర్లకు సంయమనం ఉండాలి
రాజకీయాల్లో సంయమనం ఉండాలని, మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యమైనవి కావని కవిత పేర్కొన్నారు. ఖానాపూర్ అభ్యర్థిపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని నిర్ధారించుకున్న తర్వాతే సీటు ఇచ్చారని చెప్పారు. రూ.రెండు లక్షల రుణం తీసుకోవాలని రైతులను, ప్రజలను రేవంత్‌రెడ్డి రెచ్చగొట్టడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు.
కేసీఆర్ హిస్టరీలోనే ‘భయం’ లేదు
కేసీఆర్ అనే వ్యక్తి భయపడటం అనేది చరిత్రలోనే లేదని, ఇక ముందు కూడా ఉండబోదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రెండు నియోజకవర్గాలో పోటీ చేస్తున్నంత మాత్రాన భయపడ్డారని అనుకోవడం హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పారు. కేసీఆర్ వ్యూహాలు అర్థంకానివారు తలలు పట్టుకుంటున్నారని, అర్థమైనవారు గింజుకొని చస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా పోటీ చేసి గెలువగలిగిన సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.