హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యుత్తరమిచ్చారు. మంగళవారం ఈడీ విచారణకు హాజరుకాలేనంటూ మెయిల్ ద్వారా ఆమె సమాధానమిచ్చారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా తాను మళ్లీ ఈడీ విచారణకు రాలేనని స్పష్టంచేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సంక్రాంతి రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎమ్మెల్సీ కవితకు నోటీసు ఇచ్చింది.
ఇదే కేసులో గతంలోనూ పలుమార్లు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు.. పండగపూట మరోసారి నోటీసులు ఇచ్చి మంగళవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. గతంలో ఢిల్లీకి వెళ్లి ఈడీ ఎదుట కవిత రెండుసార్లు విచారణ ఎదుర్కొన్నారు. పీఎంఎల్ యాక్టులోని సెక్షన్ 50 కింద ఇప్పటికే కవిత స్టేట్మెంట్ రికార్డు చేశారు.
అయితే మహిళను ఈడీ అధికారులు విచారించే పద్ధతిపై కవిత సుప్రీంకోర్టులో కేసు వేయడంతో గత నవంబర్ 20 వరకు ఆమెను విచారణకు పిలువొద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో మరోసారి ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో మళ్లీ ఢిల్లీ మద్యంపాలసీపై చర్చ మొదలైంది.
సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఇంకా లిస్టు కాకపోవడం, సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఏమీ రాకపోవడంతో మంగళవారం విచారణకు హాజరుకాలేనంటూ కవిత సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సైతం ఈడీ అధికారులు నాలుగుసార్లు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18న కేజ్రీవాల్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉన్నది. లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ మద్యం పాలసీ కేసును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓ అస్త్రంలా వాడుకునేందుకు ఈడీని పురికొల్పుతున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.