హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తేతెలంగాణ): దేశానికి పీవీ నర్సింహారావు అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన యోధుడని కీర్తించారు. అటు పార్టీకి, దేశానికి జీవితాన్ని ధారపోసిన పీవీని కాంగ్రెస్ అడుగడునా అవమానించిందని ఆరోపించారు. ఆయన మరణిస్తే ఢిల్లీలో అంత్యక్రియలు కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ విస్మరించినా కేసీఆర్ మాత్రం హైదరాబాద్‌లో స్మారక మ్యూజియం నిర్మించి, శతజయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించి సమున్నతంగా గౌరవించారని గుర్తుచేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పీవీ వర్ధంతి కార్యక్రమంలో పీవీ చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. అనంతరం కవిత మాట్లాడుతూ పీవీ ఆచరించిన రాజకీయ విలువలు, నిబద్ధత ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశ్నార్థకమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాణీదేవి మాట్లాడుతూ సిద్ధాంతాల కోసం పీవీ తన జీవితాన్ని ధారబోశారని కొనియాడారు. మేధోసంపత్తితో దేశానికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. ఆయన జీవితాన్ని ఈతరం ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ 14 భాషలను అలవోకగా మాట్లాడే పీవీ నర్సింహారావును ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.