హైదరాబాద్: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రే ముందుకు వచ్చి కేబినెట్ మంత్రులతో సహా అంబేద్కర్ స్మృతి వనాన్ని సందర్శించి, ఆ మహనీయునికి నివాళులర్పించాలని సూచించారు. 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన కేసీఆర్.. ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ కోపంతో విశ్వమేధావి అయిన అంబేద్కర్ను అవమానించడం మంచిది కాదన్నారు.
ప్రపంచ దేశాలు అంబేద్కర్ను గౌరవిస్తున్నాయని, మన పరిపాలన కేంద్రమైన సెక్రటేరియట్ పక్కనే నిర్మించిన 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించకపోవడం సముచితం కాదన్నారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. ఆయన పేరుతో నిర్మించిన సెక్రటేరియట్ కేంద్రంగా పాలన సాగిస్తూ కేసీఆర్పై అక్కసుతో రాజ్యాంగ నిర్మాతను గౌరవించక పోవడం మంచిది కాదని చెప్పారు. గతేడాది అంబేద్కర్ జయంతికి ముఖ్యమంత్రితో పాటు ఏ ఒక్క మంత్రి కానీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించలేదని గుర్తుచేశారు. కనీసం ఆ మహనీయుని విగ్రహానికి ఒక్క పూలమాల కూడా వేయలేదన్నారు. ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా ముఖ్యమంత్రి చొరవ చూపాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం గేట్లు తెరిచి ప్రజలు సందర్శించునే అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.