జగిత్యాల, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వస్తారని, అందుకే అతడిని ఎలక్షన్ గాంధీ అని అంటారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. కోరుట్లలో ఎన్నికలు వచ్చినప్పుడే నర్సింగరావు అనే కాంగ్రెస్ అభ్యర్థి వస్తాడని, మిగిలిన సమయంలో ఆయన ఏనాడూ కనిపించడని, ఎలక్షన్ గాంధీ పార్టీలో ఉన్న ఎలక్షన్రావు నర్సింగరావు అని చురకలంటించారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గ పరిధి బండలింగాపూర్, వెల్లుల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, అయిలాపూర్ గ్రామాల్లో గురువారం నిర్వహించిన రోడ్‌షోలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగురాని రాహుల్‌గాంధీ, హిందీరాని రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాహుల్‌గాంధీ ఇటీవల తెలంగాణకు వచ్చిన సమయంలో కాంగ్రెస్ అంటే మొహబ్బత్ దుకాణ్ పార్టీ అన్నారని, మొహబ్బత్ దుకాణ్ అంటే ప్రేమ ఉన్న సంస్థ అని అర్థమని, అయితే హిందీ అర్థంకాక రాహుల్ మాటలను ఇంకోలా అర్థం చేసుకొని రేవంత్‌రెడ్డి టికెట్ల కోసం లంచాల దుకాణాన్ని తెరిచి రేటెంతరెడ్డిగా మారిపోయాడని కవిత ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ గెలుపే తెలంగాణ ప్రజల గెలుపు అని పేర్కొన్నారు. సాధించిన తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని, ప్రపంచంముందు తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా చేశారని అన్నారు. కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
రైతుల గురించి ఆలోచించిన ఒకే ఒక్క నేత కేసీఆర్
సీఎం కేసీఆర్ కంటే ముందు ఎవరైనా రైతుల గురించి, వారికి కావాల్సిన సాగునీరు, కరెంట్ గురించి ఆలోచించారా? అని కవిత ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రైతుల గురించి ఆలోచించి వారికి రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తును అందజేశారని చెప్పారు. 50 ఏండ్ల క్రితం వ్యవసాయం సరిగా లేకపోవడం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రాంత మహిళలు వారి కుటుంబాల కోసం బీడీ కార్మికులుగా మారిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో 16 రాష్ర్టాల్లో బీడీ కార్మికులున్నా ఏ రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వడం లేదని, సీఎం కేసీఆర్ మాత్రమే బీడీ కార్మికులకు పెన్షన్ అమలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చేనాటికి సిలిండర్ ధర రూ.400గా ఉండేదని, ఇప్పుడు దాన్ని 1200కు పెంచి నిరుపేదల నడ్డి విరిచారని కవిత మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యాక సిలిండర్‌ను రూ.400కే అందజేస్తామని, మిగిలిన రూ.800 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో రైతులందరికీ సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని వర్తింపజేశారని, భూమిలేని కుటుంబాలకు సైతం ధీమా ఇవ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో బీపీఎల్‌కు దిగువన ఉన్న 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా.. ప్రతి కుటుంబానికి ధీమా పథకానికి రూపకల్పన చేశారని చెప్పారు. ఈ పథకంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ‘చనిపోయిన వారికి బీమా ఇస్తారా? బతికినవారికి బీమా ఇస్తారా?’ అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని, పండ్లు ఇకిలిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ వారి తలకాయలు తీయాలని మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. ఇవేం మాటలు..? ఇదేనా మర్యాద..? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మర్యాదస్తులం కనుకనే బీజేపీ, కాంగ్రెస్ వారి అర్థంపర్థంలేని మాటలను భరిస్తున్నామని, అడ్డదిడ్డంగా మాట్లాడటం లేదని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి.. మూడు నెలలు గడువక ముందే హామీలన్నింటినీ ఎగవేసిందని మండిపడ్డారు.
పదేండ్లుగా సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంతోపాటు ఇవ్వని వాటిని సైతం అమలు చేస్తున్నారని తెలిపారు. బీజేపీ చేసే వాగ్దానాలకు, వారి వ్యవహారశైలికి అంతుపొంతులేదని విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అడ్డదిడ్డంగా, అహంకారపూరితంగా, అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడని, అధికారం లేని సమయంలోనే ఇలాంటి ప్రవర్తన ఉంటే ఒకవేళ అధికారం వస్తే ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో? ఆయన అహంకారం ఎంత పనిచేస్తుందో ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ను మరోసారి బలపర్చి, దక్షిణభారత దేశంలోనే హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించేలా దీవించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తే సీఎం కేసీఆర్ మూడోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించి దక్షిణ భారతదేశ చరిత్రను తిరగరాస్తారన్న నమ్మకం ఉన్నదని ధీమా వ్యక్తంచేశారు. రోడ్ షోలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్ సరిపోతుందని అంటున్నారు. దసరా ముందు రైతుబంధు వేస్తే తాగి డబ్బులు నాశనం చేసుకుంటారని అవహేళన చేశారు. ధరణిని బంగాళఖాతంలో వేస్తామంటున్నారు. మూడు గంటల కరెంట్ ఇస్తే పంటలు పండుతాయా?
– ఎమ్మెల్సీ కవిత