వరంగల్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్తోనే శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ కల్వకుంట కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుండాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటే.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓట్లు మాత్రమే కోరుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ ది చేతగాని ప్రభుత్వమని ప్రజలకు తెలిసిపోయిందని, 16 నెలల పాలనలో 16 పనులు కూడా కాలేదని ఆరోపించారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లను కవిత గురువారం పరిశీలించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల విజయాన్ని ప్రపంచానికి చాటడానికే బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, ఓర్వలేని కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలను ప్రజలు క్షమించరని అన్నారు. తెలంగాణ అస్తిత్వం కోసం 2001లో కేసీఆర్ పిడికిలి బిగించి ఉద్యమాన్ని మొదలుపెట్టారని గుర్తు చేశారు. ఒక చుక్క రక్తం చిందించకుండా శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని చెప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నవయువకుల కోసం జరుగుతున్నదని, సభకు యువత పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కుంభమేళా తరహాలో రజతోత్సవ సభ జరగబోతున్నదని చెప్పారు.
మహిళా సాధికారతకు కేసీఆర్ బాటలు వేశారని కవిత పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో, మారెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం, సూటీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతిఒకరు సభకు రావాలని కోరారు. రైతులంతా గులాబీ దండులా కదలిరావాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు ఒడితెల సతీశ్‌కుమార్, నన్నపునేని నరేందర్, చంద్రావతి, సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, రాష్ట్ర నాయకులు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, రజనీ సాయిచంద్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా పార్టీ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి రూపొందించిన ‘భళే ఎగిసెర భళే ఎగిసెరా… సారే రావాలంటూ ఓరుగల్లు పిలిచెరా’ పాట సీడీని కవిత ఆవిష్కరించా రు. పాట రచించిన రిటైర్డ్ ఎమ్మార్వో మహమ్మ ద్ సిరాజుద్దీన్‌ను ఆమె అభినందించారు. భా రత జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్‌భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
ఎల్కతుర్తి, ఏప్రిల్ 24: బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 వసంతాలు కావొస్తున్న సందర్భంగా ఎల్కతుర్తిలో నిర్వహించబోయే రజతోత్సవ సభ రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసేదిగా ఉంటుందని మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సభా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. వరంగల్ పోలీసు కమిషనర్ సభ ఏర్పాట్లు చూసేందుకు రాగా, ఆయనతో పోలీసు బందోబస్తుకు సంబంధించిన ఏర్పాట్లపై మాట్లాడారు. సభాస్థలికి రావడం మొదలు ఇంటికి వెళ్లే దాకా కంటికి రెప్పలా కార్యకర్తలను కాపాడుకుంటామని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. కంట్రోల్ రూము నుంచి సీసీ కెమెరాలతో ట్రాఫిక్, సభాస్థలిని పర్యవేక్షిస్తామన్నారు.