హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మహిళా వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత గురువారం మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డలకు తరతరాలపాటు నష్టం జరిగే విధంగా ఈ ప్రభుత్వం జీవో-3ను జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం చేసే ఈ జీవోకు వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ధర్నా తలపెట్టామని, కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అనుమతి లభించకపోయినా ధర్నా చేసి తీరుతామని ఆమె తేల్చి చెప్పారు. ఆడబిడ్డలకు జీవో-3 వల్ల జరిగే నష్టం గురించి ధర్నాల్లో వివరిస్తామని తెలిపారు. ఎవరైనా ఎకడైనా ధర్నాలు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారని, ఆ మాట మీద నిలబడితే తమకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీఎం సృష్టించిన కృత్రిమ కరువు
కరువు వచ్చిందని, ఎవరూ తాగునీళ్లు, సాగునీళ్లు అడగవద్దని ముఖ్యమంత్రి అంటున్నారని, ‘ఇది కరువు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టును, కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి సృష్టించిన కృత్రిమ కరువు’ అని కవిత వ్యాఖ్యానించారు. అనుభవ రాహిత్యం, అవగాహనరాహిత్యంతో ప్రభుత్వం చెరువులను నింపలేకపోయిందని, ఆ నెపాన్ని ప్రకృతి వైపరీత్యంగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
అర్వింద్‌ను మళ్లీ ఓడిస్తా
బీజేపీ ఎంపీ అర్వింద్ ఎకడ నుంచి పోటీ చేసినా ఓడిస్తానని కవిత శపథం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్లలో అర్వింద్‌ను ఓడించానని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓడిస్తానని, అదే తన ఎజెండా అని స్పష్టం చేశారు. తాను పోటీ చేసే విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. అలాగే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలను బొందపెట్టాలని చూస్తున్నారని, అది ఆ పార్టీలతో సాధ్యం కాదని తేల్చిచెప్పారు. తనపై నమోదైన 41 సీఆర్ పీసీ కేసు వ్యవహారం టీవీ సీరియల్ లాగా సాగుతున్నదని అన్నారు.