ఖలీల్వాడి, నవంబర్ 9: యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడకు చెందిన హారిక ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్థోమత లేక కాలేజీలో చేరలేదు. ఈ విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత తక్షణమే స్పందించారు. హారిక ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చు ను భరిస్తానని హామీ ఇచ్చారు.
ఇందులో భాగంగా మొదటి ఏడాదికి సంబంధించిన కాలేజీ ఫీజును బుధవారం చెక్కు రూపంలో హారికకు అందజేశారు. చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని కవిత పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాదని హారిక నిరూపించిందని, ఉన్న వనరులనే సద్వినియోగం చేసుకుని ఎంబీబీఎస్ సీటు సాధించడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు. వైద్యురాలిగా సమాజానికి సేవలందించాలని ఆమెకు సూచించారు. తన చదువుకు ఆర్థికంగా అండగా నిలిచినందుకు హారికతోపాటు ఆమె కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు.