MLC Elections | హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన నాలుగు పథకాలకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో నిబంధనల ప్రకారం ఆ పథకాలను నిలిపివేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రారంభించిన 3 రో జులకే ఆ పథకాలు మూలన పడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసీ.. తూతూ మంత్రంగా పథకాలను ప్రారంభించిన రైవంత్ సర్కార్ అమలుకు ముందే కోడ్ వంకతో వాటిని పక్కన పెట్టేందుకు సిద్ధమైందని ప్రచారం జరుగుతున్నది. ఈ ఏడాదంతా వరుసగా ఎన్నికలు ఉండటంతో ఆ పథకాలు ఇప్ప ట్లో అమలయ్యే అవకాశమే లేదన్న చర్చ జరుగుతున్నది.
రైతు భరోసా పథకం అమలు విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆది నుంచే అన్నదాతలను మోసగిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవగా.. ఎన్నికల కోడ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిలిపివేయించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఆ పార్టీ ఊదరగొట్టింది. అనంతరం అధికారంలోకి వచ్చాక క్యాబినెట్ సబ్ కమిటీ పేరుతో రేవంత్‌రెడ్డి సర్కారు కాలయాపన చేసింది. గత 14 నెలల్లో మూడుసార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా రెండుసార్లు మొండిచెయ్యి చూపింది.
చివరికి యాసంగిలో పెట్టుబడి సాయాన్ని ఎగొట్టి వానకాలం సమయంలో వేసింది. ఆ సాయాన్ని కూడా రూ.12 వేలకే పరిమితం చేసింది. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచాలని ఈ నెల 4న క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం జరిగింది. కనీసం ఆ మరుసటి రోజు నుంచే ఆ పథకాన్ని అమలు చేస్తే ఇప్పటికే రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేవి. కానీ, రైతులను ఊరించిన రేవంత్ సర్కారు.. చివరికి ఈ నెల 26 నుంచి ఆ పథకాన్ని అమలు చేసింది. ముందుగా ఎంపిక చేసిన గ్రామాల్లోని వారికి మాత్రమే రైతు భరోసా వేస్తామని చెప్పింది. దాన్ని కూడా అరకొర గానే జమ చేసింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో మిగతా రైతులకు మార్చి 4 వరకు రైతుభరోసా నిధులు అందే అవకాశం లేదు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం నిరుపేదలు 14 నెలలుగా ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఇప్పుడు అంటూ వారిని ఊరిస్తూ వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు.. ప్రజల నుంచి ఒకటికి రెండుసార్లు దరఖాస్తులు తీసుకుంది. చివరికి గ్రామాల్లో వివాదాలు, ఘర్షణల మధ్య ఈ నెల 26న పథకాన్ని ప్రారంభించింది. కానీ, ఇప్పుడు ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిధులు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇందిరమ్మ ఇండ్లకు మరోసారి బ్రేక్ పడిందని, ఆ పథకానికి ఇప్పట్లో మోక్షం కలిగేలా లేదని అర్హులు వాపోతున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులది కూడా ఇదే పరిస్థితి.
ఆగిపోయిన నాలుగు పథకాలు ఈ ఏడాది తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మార్చి మొదటి వారంలో ముగుస్తుంది. ఆ తర్వాత మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు స్థానిక, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలతో ఈ ఏడాదంతా కోడ్‌తోనే గడిచిపోనున్నది. దీంతో ఆ 4 పథకాలకు ఈ సంవత్సరంలో మోక్షం కలిగే అవకాశం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ 4 పథకాలను ఈ నెల 26న ప్రారంభించినట్టు స్పష్టమవుతున్నది. ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగుస్తుందని, ఈ లెకన జనవరి చివర్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసు. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో రేవంత్‌రెడ్డి సర్కారు తీవ్ర నిధుల కొరతతో సతమతమవుతున్నది. మరోవైపు రాష్ర్టానికి అప్పులు ఇవ్వకుండా రిజర్వు బ్యాంకు కట్టడి చేస్తున్నది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న పథకాల అమలే ప్రభుత్వానికి భారంగా మారింది. ఇలాంటి సమయంలో కొత్త పథకాల అమలు సాధ్యం కాదని ఆర్థిక నిపుణులు పదే పదే స్పష్టం చేస్తున్నారు. అందుకే తూతూ మంత్రంగా పథకాలను ప్రారంభించి ఎన్నికల కోడ్ పేరుతో వాటి అమలును నిలిపివేసేలా రేవంత్‌రెడ్డి సర్కారు ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. ఆ పథకాలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వెంటనే ఎన్నికల సంఘానికి లేఖ రాసి, అనుమతి తీసుకోవాలని విమర్శకులు సూచిస్తున్నారు.