హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ఎజెండాను సృష్టించింది కేసీఆర్. కేంద్ర మంత్రి పదవిని వదిలేసి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి, అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అందుకే కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవమే’ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ స్పష్టంచేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు గురించి మాట్లాడితే తెలుగువారి ఆత్మగౌరవం అయినప్పుడు, కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం కాదా? అని ప్రశ్నించారు.
కచ్చితంగా కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవమేనని పునరుద్ఘాటించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిపాలనను గాలికొదిలి విదేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఎంజాయ్ చేశారని విమర్శించారు. ప్రభుత్వ ధనంతో రేవంత్ తన సరదాలు తీర్చుకుంటున్నారని ఆరోపించారు. విచారణల పేరుతో ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. రెండేండ్లుగా విచారణ చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ కేసులో ఏమీ తేల్చలేకపోయిందని మండిపడ్డారు.