హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రాజకీయ ప్రసంగాలు చేయడమేంటని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో మీడియా సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌ది భూ స్వామ్య మనస్తత్వమని, వీసీని ఏకవాక్యంతో పిలవడమేంటని ప్రశ్నించారు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారి ఓయూని సందర్శించినప్పుడు ఉన్నత, యూనివర్సిటీ విద్యపై ఓ విజన్‌ను ఆవిష్కరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఓయూలో కాళేశ్వరం గురించి మాట్లాడటమేంటని ప్రశ్నించారు. ఉస్మానియా భూములను బీఆర్ఎస్ నేతలు ప్లాట్లు చేసుకుని రేవంత్‌రెడ్డి ఆరోపించారని, గచ్చిబౌలి భూములను ప్లాట్లు చేసి అమ్ముకున్నదెవరో ప్రజలే చెప్పాలని కోరారు.
బీఆర్ఎస్ హయాంలో ఆరు లక్షల కోట్ల అప్పులంటూ స్పీకర్ తప్పుగా మాట్లాడరని, రూ.3లక్షల 50 వేల 520 కోట్లు అప్పు అయ్యిందని లోక్‌సభ సాక్షిగా కేంద్రమంత్రి వెల్లడించారని గుర్తు చేశారు. ఓయూకు వెంటనే రూ.1000 కోట్ల నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కోదండరాంపై సీఎం రేవంత్ మొసలి కన్నీరు కారుస్తున్నారని, నిజంగా అంత గౌరవం ఉంటే ఆయననే ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధనేత కేసీఆర్ నాడు కోదండరాంను జేఏసీ చైర్మన్ విషయాన్ని గుర్తుచేశారు. ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరాం నియామకాన్ని గవర్నర్ ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు. దీనిపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ వెళ్తే తప్పేంటని నిలదీశారు. తాము ఓయూ పర్యటనకు వస్తే ఒక్క పోలీస్ లేకుండా రావాలని సీఎం రేవంత్ గతంలో అన్నారని, ఆయన మాత్రం భారీ పోలీస్ బలగాల మధ్య పర్యటించారని ఎద్దేవా చేశారు.