MLC By Elections | హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): శాసనసభ్యుల కోటా కింద ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెండు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేయడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈసీ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. గురువారం జారీ అయిన ఈసీ నోటిఫికేషన్ రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఉందని చెప్పింది. ఒకే ఓటును ప్రాధాన్య క్రమంలో దాఖలు చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందడంతో శాసనమండలిలో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి.
ఈ రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్ ఈ నెల 4న షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఆ రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసింది. తెలుపు, గులాబీ రంగుల బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. దీనిని మాజీ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పీ కార్తీక్‌రెడ్డి సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. నోటిఫికేషన్ వెలువడ్డాక కోర్టుల జోక్యానికి వీల్లేదని రాజ్యాంగంలోని 329(బి) అధికరణం స్పష్టం చేస్తున్నదని ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ అన్నారు. ఈ వాదనను ఆమోదించిన హైకోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది.