నర్సంపేట, మార్చి 25 : నిబంధనలకు విరుద్ధంగా బాలికల మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో అధికార పార్టీకి చెందిన వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తనయుడు అవియుక్త్రెడ్డి పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. దీనికి సంబంధిత ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సహకరించడం విమర్శలకు దారి తీసింది. గురుకులంలో పాఠాలకు బ్రేక్ ఇచ్చిన ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థినుల సమక్షంలో అవియుక్త్రెడ్డి ఫొటోలతో చేపట్టిన భారీ కేక్‌ను కట్‌చేసి పంచిపెట్టారు.
కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట మాజీ సర్పంచ్ చిలువేరు రజినీభారతి, నర్సంపేట పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ పాలాయి రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వేడుకలను నిర్వహించారు. విద్యార్థులతో ఎమ్మెల్యే తనయుడికి ఉపాధ్యాయులు శుభాకాంక్షలు చెప్పించడం గమనార్హం. బాలికల గురుకుల విద్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు వ్యవహరించిన తీరును పలువురు విద్యావేత్తలు ఖండించారు. దీనిపై కలెక్టర్ స్పందించి నిబంధనలకు విరుద్ధంగా గురుకులంలో ఎమ్మెల్యే తనయుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు సహకరించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు.