Yennam Srinivas Reddy | హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బతుకమ్మ బహుజనుల పండుగ కాదని, వారు పూర్వం నుంచి బతుకమ్మ ఆడనేలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ముగిసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ తల్లి విగ్రహం లో బతుకమ్మను తీసివేయడం వెనుక ఏమైనా కారణాలున్నాయా?’ అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన పైవిధంగా స్పందించారు. ‘మీకు చరిత్ర తెల్వదు. తెలంగాణ గ్రామాల్లో బహుజనులు బతుకమ్మ ఆడలేదు. బోనాలు ఆడిండ్రు. హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతా ల్లో బహుజనులు అతిగా ఇష్టపడే పండుగ బోనాలు. వేలసంఖ్యలో పాల్గొనేవారు.
‘యెన్నం’ మాటలు వాస్తవమే: వీరేశం
బతుకమ్మను బహుజను లు ఆడరనే అంశంపై ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా మీడియా పాయింట్ వద్ద స్పందించారు. ‘యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చెప్పింది నిజమేనని, బహుజనులు బతుకమ్మ ఆడలేదని తెలిపారు. బహుజనులు బతుకమ్మ ఆడితే.. మా విమలక్క బహుజనుల బతుకమ్మ ఆడాల్సిన అవసరం ఉండేది కాదని పేర్కొన్నారు. నేను కూడా మాదిగ సామాజికవర్గం నుంచి వచ్చానని, మా జాతి మాంకాళమ్మ బోనాలు, ముత్యాలమ్మ బోనాలు ఎత్తింతి తప్పా.. ఏనాడూ బతుకమ్మ ఆడిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. తెలంగాణకు బతుకమ్మ అవసరం, బోనాలు అవసరం. ఒక చేతిమీద బతుకమ్మను, బోనాన్ని పెట్టలేం కదా అని తెలిపారు. తెలంగాణ తల్లి ఏర్పాటు సందర్భంగా అమరువీరుల స్థూపాన్ని ఎందుకు అలంకరించలేదన్న ప్రశ్నకు.. ‘అమరు వీరుల స్థూపానికి దండ వేయడానికి, అలంకరించుకోవడానికి ఇది అమరవీరుల దినోత్సవం కాదు కదా.. అని చెప్పారు.