నయీంనగర్, ఏప్రిల్ 29 : ‘నేను ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మనిషిని.. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు.. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడున్నా సరే.. ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే’ అంటూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అనుచరుడు కోన శ్రీకర్ బెదిరించినట్టు బాధితులు తెలిపారు. బాధితురాలు చింతల స్వరూప కథనం ప్రకారం.. చింతల స్వరూప తన మామ చింతల వెంకట్రాంనర్సయ్య నుంచి సంక్రమించిన ఇంట్లో 30ఏండ్లుగా ఉంటున్నారు. కరెంట్ బిల్లుతోపాటు ఇంటి పన్ను కడుతున్నారు. మంగళవారం ఆమె తన కూతురితోపాటు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో ఎమ్మెల్యే నాయిని అనుచరుడు కోన శ్రీకర్ కొంతమంది రౌడీలు, జేసీబీలతో వచ్చి ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు.
వారి సెల్ఫోన్లను లాక్కొని, జేసీబీతో ఇంటిని ధ్వంసం చేశాడు. ఉగాది పండుగకు ముందు రోజు ఇలాగే జరగడంతో బాధితులు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి వద్దకు వెళ్లి చెప్పుకొంటే అలా ఏమీ చేయరని హా మీ ఇచ్చారు. మళ్లీ కొద్దిసేపటికి ఎమ్మెల్యే నాయిని బాధితులకు ఫోన్‌చేసి ఆ భూమి మీది కాదంట కదా అమ్మా.. అని అనడం తో ఏం చేయాలో అర్థం కాలేదని స్వరూప ఆవేదన వ్యక్తంచేశారు. గతనెల 20న వీధి వ్యాపారులపైనా ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టించడంతో వారు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. తాజాగా ఇంట్లో అందరూ ఉండగా ఇంట్లోకి జేసీబీలతో ధ్వంసం చేయడమేమిటని చర్చించుకుంటున్నారు.
‘నమస్తే’ కథనంతో ఆగినా.. మళ్లీ నేడు వెలుగులోకి
‘వారసత్వ భూమిని కబ్జా చేస్తున్నాడు.. స్థానిక ఎమ్మెల్యే అనుచరుడినని బెదిరిస్తున్నాడు’ అంటూ ‘నమస్తే తెలంగాణ’లో ఈనెల 5న కథనం ప్రచురితమైంది. దీంతో అంతా సద్దుమణిగిందని అనుకునేలోపే మళ్లీ జేసీబీలు రావడంతో ఏం చేయాలో తెలియక బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘ఇక్కడ భూముల పంచాయితీలు చెయ్యబడవు’ అంటూ స్టిక్కర్ అతికించారు. కానీ, బయట మాత్రం ఆయన అనుచరులతో ఇండ్లపైకి జేసీబీలు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. నిరుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లునే.. నేడు జేసీబీలతో కూలగొట్టి కబ్జాకు యత్నిస్తుం డటంపై విమర్శలొస్తున్నాయి.