గుంపులో ఉన్న ఒక వ్యక్తి తానే సమర్థుడినని నిరూపించుకునేందుకు రెండు మార్గాలుంటాయి! అయితే నేరుగా అందరితో పోటీ పడి తన సామర్థ్యాన్ని ప్రదర్శించి నిరూపించుకోవడం! లేదంటే తనకు పోటీ అనుకునేవారిని పరోక్షంగా దెబ్బకొట్టి వారు అసమర్థులని చూపడం! ప్రస్తుతం అధికార పార్టీలో ఇలా రెండో రకం పోరే నడుస్తున్నది.
పాలనాపరంగా ముఖ్యనేత విఫలమయ్యారని ఇప్పటికేఢిల్లీ పెద్దలకు అర్థమై ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ పరిస్థితిని ఏడాది ముందే ఊహించిన ఆ ముఖ్యనేత.. తనకు పోటీ అని భావించిన నేతలను రాజకీయ ఉచ్చులో పడేసి వారిపై అవినీతి, అసమర్థ ముద్రలు వేయించడంలో సఫలమైనట్టు చర్చ కొనసాగుతున్నది. ముఖ్యనేత తమకు ప్రాధాన్యం ఇచ్చినట్టే ఇచ్చి నిండా ముంచారని, తమ వేలితో తమ కన్నునే పొడిపించారని సదరు మంత్రులు వాపోతున్నారు. ఇలా సదరు ముఖ్యనేత రాజకీయ కుట్రలకు బలైన కాంగ్రెస్ ముఖ్యుల కథనాలు వరుసగా..
Congress Party | హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ గెలుపు కోసం అంగబలం, అర్థబలం అందించిన కీలక నేత.. అధికారంలోకి వచ్చిన తర్వాత నంబర్ టూగా వెలుగు వెలిగారు. ఓ దశలో శాఖలతో సంబంధం లేకుండా ఆయన చెప్పిందే వేదమన్నట్టు సాగింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సొంతపార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేయడంతోపాటు ఆయన ప్రోద్బలంతో జరుగుతున్న భూముల వ్యవహారాలపై ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే కోర్టును ఆశ్రయించారు. మరోవైపు కేంద్ర ఏజెన్సీలు వరుసగా దాడులు చేశాయి. ఫలితంగా ఇప్పుడు సదరు ‘నంబర్ 2’ నేత గప్‌చుప్ అయిపోయారు. తన శాఖకే పరిమితమయ్యారు. ముఖ్యనేత రాజకీయ వ్యూహంలో నలిగిపోయిన ఆ మంత్రి ప్రస్థానంపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తున్నది.
అన్నీతానై నడిపి..
కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో రెండు ఉమ్మడి జిల్లాలది కీలక పాత్ర! ఆ జిల్లాల్లో కాంగ్రెస్ దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది. దీని వెనుక ఓ నేత ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. ఎన్నికల సమయంలో దాదాపు 22 మంది అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారని, అన్నీతానై నడిపారని చెప్పుకొన్నారు. అందుకే ఆయనకు ప్రభుత్వంలో కీలక శాఖ దక్కింది. ఇదే సమయంలో అధిష్ఠానంతోనూ సాన్నిహిత్యం పెరిగింది. తొలినాళ్లలో ఆయన ‘నంబర్ 2’గా వెలుగొందారు. వాస్తవానికి ఆయనకన్నా సీనియర్లు, తరాలుగా కాంగ్రెస్‌నే నమ్ముకొని, సీఎం పదవి రేసులో నిలబడిన నేతలున్నా ఆ మంత్రినే ‘నంబర్ 2’గా పిలుచుకునేవారు. ఈ విషయాన్ని ఒకట్రెండు చోట్ల ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు. ఒకప్పుడు ప్రభుత్వంలో ఆయన చెప్పిందే వేదమన్నట్టుగా నడిచేది. శాఖలతో సంబంధం లేకుండా అన్ని విభాగాలపై సమీక్షల్లో పాల్గొనేవారు. ఆయా శాఖలకు సంబంధించిన నిర్ణయాలను స్వేచ్ఛగా వెల్లడించేవారు. ముఖ్యమంత్రిని మారుస్తారన్న ప్రచారం జరిగిన ప్రతిసారీ ఈయన పేరు బలంగా వినిపించేది. సచివాలయంలోనూ ఆయనను కలవడానికి రోజూ వందలాది మంది క్యూ కట్టేవారు.
పోటీగా ఉన్నారని అణచివేత
రాష్ట్ర పార్టీ ఇన్చార్జి నుంచి తాజాగా ఢిల్లీకి చేరిన నివేదికలో ‘నంబర్ 2’ మంత్రి ఫైల్ కూడా ఉన్నదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తండ్రీకొడుకులపై ఆరోపణల నేపథ్యంలో ఆయన శాఖలను మార్చాలని ఢిల్లీ పెద్దలు సూచించినట్టు సమాచారం. ‘నేనే అడ్డంపడి నీ పదవిని కాపాడిన’ అంటూ ముఖ్యనేత ఆ మంత్రితో చెప్పినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ‘నంబర్ 2’గా తనకు తానే ప్రకటించుకోవడం, తనతో పోటీగా అన్ని శాఖలపై సమీక్షలు చేయడం, అధిష్ఠానం దగ్గర సాన్నిహిత్యం పెంచుకోవడం వంటి పరిణామాలు ముఖ్యనేతకు రుచించలేదని పేర్కొంటున్నారు. ఇటీవల సదరు నేత ప్రభుత్వ సదస్సులను అడ్డం పెట్టుకొని హెలికాప్టర్లో చక్కర్లు కొట్టడం, గతంలో తాను ఫండింగ్ చేసి గెలిపించిన ఎమ్మెల్యేలను వరుసగా కలుస్తుండటం ముఖ్యనేతకు రుచించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు సోదిలో లేని పార్టీని తాను నెలబెట్టి గెలిపించానని, కానీ మొత్తం ఆయన వల్లే జరిగినట్టుగా నంబర్ 2 నేత చెప్పుకోవడం ముఖ్యనేతకు విసుగు తెప్పించిందని సమాచారం.
ఇక ప్రభుత్వ నిర్ణయాలను తనకన్నా ముందే సదరు నేత చెప్పేయడంపైనా తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలిసింది. అందుకే ఇంటా, బయటా పొగబెట్టించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సదరు మంత్రి భూముల వ్యవహారాలపై ముఖ్యనేత దగ్గరుండి తన వర్గం ఎమ్మెల్యేలతో అటు అధిష్ఠానానికి ఫిర్యాదులు, ఇటు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయించారని చెప్తున్నారు. ఇక మంత్రి దగ్గర పనిచేస్తున్న ఇద్దరు అధికారులను ఆయనకు తెలియకుండానే మార్చేశారని సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రికి చాలా సన్నిహితంగా ఉండి, భూముల వ్యవహారాలను దగ్గరుండి చూస్తున్న ఓ ఉన్నతాధికారిని తాజాగా వేరే శాఖకు బదిలీ చేశారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం ఏర్పడగానే మొదటి విడతలోనే ఆయనను బదిలీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ సదరు మంత్రికి దగ్గరై వ్యవహారాలన్నీ చక్కబెడుతుండటంతో ఇప్పట్లో బదిలీ జరగదని అంతా అనుకున్నారు. మంత్రికి చెప్పకుండానే అకస్మాత్తుగా వేరే శాఖకు బదలాయించారని చెప్పుకుంటున్నారు. దీంతో ఆయన గప్‌చుప్ అయ్యారని సమాచారం. ఇలా ముఖ్యనేత దెబ్బకు విలవిలలాడుతున్న ‘నంబర్ 2’.. ఇదే ముఖ్యనేత వల్ల అవినీతి ముద్ర వేయించుకున్న మరో ‘నంబర్ 2’ నేతకు దగ్గరవుతున్నారని ఆ ఉమ్మడి జిల్లా నేతలు చెప్తున్నారు. మొదట్లో ఇద్దరి మధ్య దూరం ఉండేదన్నది బహిరంగ రహస్యమే కాగా కొంతకాలంగా వారి మధ్య సఖ్యత పెరగడం గమనార్హం.
ఇంటా, బయటా వివాదాలు
అంతా బాగానే ఉన్నదని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కేంద్ర నిఘా సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. ఆ మంత్రి కుమారుడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వరుసగా నిఘా సంస్థలు ఆ మంత్రి ఇల్లు, ఆఫీస్, కుటుంబ సభ్యుల ఇండ్లపై దాడులు చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి ‘ఎవరు ఉప్పందించారో’ తెలియదుగానీ మంత్రి పరువును జాతీయ స్థాయిలో తీసేశారంటూ కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంలోని ‘ప్రధాన’ నేతకు సన్నిహితులు ఉండే రాష్ట్ర ముఖ్యనేత బాగానే ‘ఖర్చు’ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రిపై అవినీతి ఆరోపణలు చేశారు.
30 శాతం కమీషన్ ఇస్తే తప్ప తమ మంత్రి పనిచేయరంటూ బాంబు పేల్చారు. దీంతో ఆయనపై 30 పర్సెంట్ మంత్రిగా ముద్రపడిందని చెప్తున్నారు. ఫలితంగా కొన్నాళ్లుగా ఆయన గప్‌చుప్ అయ్యారు. తన శాఖకు మాత్రమే పరిమితమయ్యారని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో రూ.10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంటూ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ భూముల వ్యవహారం వెనుక కూడా ‘నంబర్ 2’ నేతనే ఉన్నట్టు రెవెన్యూ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదేకాదని, గతంలోనూ అనేక భూ వ్యవహారాల్లో సదరు నేత ప్రమేయంపై అధిష్ఠానానికి ఫిర్యాదులు చేరినట్టు సమాచారం. ఈ పరిణామాలతో హైదరాబాద్‌లో ఉండటం తగ్గించారని, ఎక్కువ సమయం సొంత జిల్లాలోనే గడుపుతున్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.