గద్వాల, అక్టోబర్ 8 : సాగునీరు అందక డీ-38, డీ-40 పరిధిలో రైతుల పంటలు ఎండుతున్నాయని, వెంటనే వారబందీ ద్వారా నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఇరిగేషన్ అధికారులను కోరారు. రెండు రోజుల్లో చివరి ఆయకట్టుకు నీరు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి మరోసారి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ శ్రీనివాస్‌రావును ధర్మారం, పల్లెపాడ్, గార్లపాడ్, బోరవెళ్లి, చండూరు గ్రామాల రైతులతో కలిసి ఎమ్మెల్యే జూరాల ఎస్ఈకి వినతిపత్రం అందజేశారు. వారబంది ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. డీ-38 పరిధిలో రైతులు సుమారు నాలుగు వేల ఎకరాల్లో మిరప సాగు చేశారని, ఇప్పటికే దానిపై లక్షల్లో పెట్టుబడి పెట్టారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీరు ఇవ్వక పోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
ఎర్రవల్లి, మానవపాడు మండలాల్లో విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తంగా ఉన్నదని, దీన్ని వెంటనే మెరుగు పర్చాలని ఎమ్మెల్యే విజయుడు విద్యుత్తు శాఖ ఎస్ఈ అబ్దుల్‌కరీంను కోరారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని విద్యుత్తు శాఖ కార్యాలయంలో ఎస్ఈ అబ్దుల్‌కరీంను కలిసి విద్యుత్ సమస్యలను వివరించారు. నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరా చేయకపోతే సబ్స్టేషన్ల ముందు రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.