భీమ్‌గల్, జనవరి 22: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలన్నీ బోగస్ సభలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ప్రజాపాలన, గ్రామసభల పేరిట ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలు, 420 హామీలను వందరోజుల్లో అమలుచేస్తానని చెప్పి గద్దెనెక్కారని తెలిపారు.
హామీలు అమలుచేయమంటే అప్లికేషన్ల పేరిట ప్రజలను జిరాక్స్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు, మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ ఏడాదికాలంగా తిప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడాది పొడవునా ఇచ్చిన దరఖాస్తులు ఎక్కడపడేశారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో ప్రజలను మభ్యపెట్టడానికే గ్రామసభల డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు. ‘గ్రామసభలు పేరుకే నిర్వహిస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినవారికే ఇండ్లు, రేషన్‌కార్డులు వస్తాయని’ కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తెలిపారని చెప్పారు. అన్నీ వారికే ఇస్తే గ్రామసభలు, అధికారుల సర్వే ఎందుకని ప్రశ్నించారు.
పథకాల జాబితాలో అర్హుల పేర్లు ఉండే లా లబ్ధిదారులు గ్రామసభల్లో పట్టుబట్టాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని వేముల పేర్కొన్నారు. గ్రామాల్లో లబ్ధిదారులు వారిపేర్లు జాబితాలో లేకపోవడంతో అధికారుల ను నిలదీస్తున్నారని చెప్పారు. అర్హులకు అండగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారని చెప్పారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని నిలదీయాలని పిలుపునిచ్చారు.