హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాల కోరు అని, రైతులనే కాదు దేవుళ్లను కూడా మోసం చేస్తున్నాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. డిసెంబర్ 9నే రైతులందరికీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న ఆయన మళ్లీ 100 రోజుల్లో చేస్తానన్నాడని అప్పుడూ చేయలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని దేవుళ్లందరిపై ప్రమాణం చేసి ఆగస్టు 15లోపు రైతులందరికీ రూ.31 వేల కోట్లతో రెండు లక్షల చొప్పున రుణమాఫీని ఏకకాలంలో చేస్తానని చేయలేదని ఆరోపించారు. ఇప్పటివరకు కేవలం రూ.17,934 కోట్లు మాత్రమే మాఫీ చేశారని, 36 లక్షల మంది రైతులుంటే కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ చేస్తూ రైతులనే కాదు దేవుళ్లనూ మోసం చేశాడని ధ్వజమెత్తారు.
రుణమాఫీపై మాజీ మంత్రి హరీశ్‌రావు చాలెంజ్ విసిరితేనే ఆ మేరకు అమలు చేశారని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు, 13 హామీలు ఆగస్టు 15లోపు అమలు చేస్తే రాజీనామా చేస్తానని నాడు హరీశ్‌రావు ప్రకటించారని గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీలు, 13 హామీలు, రుణమాఫీని అమలు చేయకుండానే దబాయిస్తున్నాడని, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని విమర్శించారు. రైతులకు అరకొర రుణమాఫీ చేసి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడంటూ విమర్శించారు. రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని, లేకుంటే రేవంత్‌కు దేవుళ్లు, ప్రజలు, రైతులు తగిన శాస్తి చేస్తారని హెచ్చరించారు.
రేవంతే ముక్కునేలకు రాయాలి: ఓయూ జేఏసీ చైర్మన్ కరాటే రాజునాయక్
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే తన పదవికి రాజీనామా చేసి అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని ఓయూ జేఏసీ చైర్మన్ కరాటే రాజునాయక్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీల్లో భాగమైన 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి సీఎం పదవికి అనర్హుడని గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌కు స్పందించి, ఆగస్టు 15 నాటికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ సహా ప్రజలకు ఇచ్చిన ఇతర అన్ని హామీలను అమలు చేస్తానని గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు మోసం చేసినట్టేనని తెలిపారు.
హరీశ్‌రావుపై సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటు: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి
రుణమాఫీ విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాననే విషయం మరిచిన రేవంత్‌రెడ్డి ఓ బజారు వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. పంద్రాగస్టులోపు ఆరు గ్యారెంటీల అమలు, రైతులందరికీ రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని హరీశ్‌రావు స్పీకర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
దేవుళ్లందరిమీద ఒట్టుపెట్టి మాట తప్పింది రేవంత్‌రెడ్డేనని తెలిపారు. రూ.31 వేల కోట్లను ఆగస్టు 15లోపు మాఫీ చేస్తానని చెప్పి కేవలం రూ.18 వేల కోట్లతో సరిపెట్టి దానికే ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావును విమర్శించే నైతిక హక్కులేదని పేర్కొన్నారు. ఏట్లో దూకాల్సింది హరీశ్‌రావు కాదని, మాట తప్పినందుకు రేవంతే దూకాలని డిమాండ్ చేశారు.