నిజామాబాద్ : పేదింటి అడబిడ్డ పెళ్లికి ఆసరాగా ఉండటానికి ఒక మేనమామ కట్నంగా కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula) అన్నారు. వేల్పూర్, బాల్కొండ మండలాల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi ), షాదీ ముబారక్ చెక్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి రాగానే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాం అని మాట ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి(CM Rvanth reddy) ముఖ్యమంత్రి అయ్యారు. వారు అధికారంలోకి వచ్చి 10 నెలలు అయిన ఇచ్చిన తులం బంగారం మాట నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందుకున్న వారందరికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని, అడబిడ్డల పక్షాన రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వంలో కేసీఆర్ దసరా పండుగకు పేదింటి అడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చీరలు పంపిణీ చేయలేదన్నారు. మూసి ప్రక్షాళన పేరుతో పేద ప్రజల ఇండ్లు కూల్చుతున్నారు. దీనివల్ల ఒక్క ఏకరానికైనా లాభం జరుగుతుందా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలు కాంగ్రెస్ను మూసీలో ముంచుతారన్నారు.