భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు స్థలాలు ఇవ్వడంతోపాటు ఇంటి పట్టాలు ఇచ్చి అండగా నిలుస్తోంది. పేదలు ఇళ్లు లేదని ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో వారికి చేయూతనిస్తూ బాసటగా నిలుస్తోంది. వారం క్రితం భూమిలేని నిరుపేదలు 800 మందికి మూకుమ్మడిగా పాతకొత్తగూడెంలో పట్టాలు పంపిణీ చేసి వెన్నుదన్నుగా నిలిచిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. భూ నిర్వాసితులకు సైతం ఇంటి స్థలాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడడంతోపాటు ఇళ్లు లేని పేదలకు భూమి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో పేదలకు పట్టాలతోపాటు స్థలాన్ని ఎమ్మెల్యే వనమా కేటాయించారు. దీంతో లబ్ధిదారులు ఆనందపడుతున్నారు.
అద్దె ఇంట్లో కష్టాలు పడుతున్న పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చిన సర్కారు నేడు సింగరేణి ఓసీలో ఇండ్లు కోల్పోయిన మూడు కాలనీల ప్రజలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే గోధుమవాగు పక్కన ఉన్న పదెకరాల స్థలాన్ని చదును చేయించి వారికి కేటాయించింది. రుద్రంపూర్ పరిధిలోని వనమా కాలనీ, ఎస్ఆర్టీ కాలనీ, మాయాబజార్ కాలనీల్లో 286 మంది నిర్వాసితులకు ఇంటి స్థలాలు ఇవ్వనున్నది. మంగళవారం అధికారికంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వీరితోపాటు గతంలో రైల్వే పరిసర ప్రాంతంలో నష్టపోయిన నిర్వాసితులకు కూడా స్థలాలు ఇవ్వనున్నారు.
ఏళ్లుగా అద్దె ఇంట్లోనే పిల్లలతో ఉంటున్నాం. ఇల్లు లేదా స్థలం వస్తుందని అనేక ఏళ్ల నుంచి ఎదురుచూసినా ఎవరూ ఇవ్వలేదు. పోయిన నెలలో దరఖాస్తు చేసిన. ఆఫీసర్లు వచ్చి సర్వే చేసిండ్లు. కానీ.. ఇంటి స్థలం వచ్చిందని కౌన్సిలర్ చెప్పిండు. నా సంతోషం అంతా ఇంతా కాదు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– తాళ్ల రాజేశ్వరి, బూడిదగడ, కొత్తగూడెం
నేను దివ్యాంగురాలిని. కేసీఆర్ అందించే పెన్షన్ వస్తున్నది. నా కూతురు, నేను అన్నయ్య దగ్గర ఉంటూ బతుకుతున్నాం. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోమంటే చేసుకున్న. దేవుడి దయ, కేసీఆర్ పుణ్యాన ఎమ్మెల్యే చేతులమీదుగా పట్టా అందుకున్న. నా కుటుంబానికి అండగా నిలిచిన కేసీఆర్ సార్ను మరిచిపోలేను.
– అలుగోలు భాగ్యలక్ష్మి, హనుమాన్ బస్తీ, కొత్తగూడెం
నా భర్త వంట మాస్టర్. పళ్లైనప్పటి నుంచి అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. జీవితాంతం అద్దె ఇంట్లోనే ఉంటామనుకొని భయపడ్డా. కానీ.. కేసీఆర్, ఎమ్మెల్యే దయతో ఇంటి స్థలం మంజూరైంది. గృహలక్ష్మి కూడా మంజూరు చేయిస్తా అని ఎమ్మెల్యే చెప్పిండు. ఆనందంగా ఉంది. సొంత ఇల్లు ఉంటే ఆ సంతోషం చెప్పలేనిది.
– షేక్ నజ్మా, హాస్పిటల్ ఏరియా, కొత్తగూడెం
ప్రజా సేవ చేయడమే నా లక్ష్యం. గతంలో లక్ష మందికి ఇళ్లు కట్టించాను. మళ్లీ మొన్ననే 800 మందికి ఇంటి పట్టాలు ఇచ్చాను. మంగళవారం నిర్వాసితులకు ఇంటి స్థలం ఇస్తున్నాను. పాల్వంచ, కొత్తగూడెం జంట నగరాలను అభివృద్ధి చేసి చూపించాను. ముర్రేడు నిర్వాసితులకు కూడా ఇంటి స్థలాలు ఇస్తాను. ఇప్పటికే డబుల్ బెడ్రూంలు కేటాయించాం. గృహలక్ష్మి, దళితబంధు ద్వారా లబ్ధిదారులకు సాయం చేస్తున్నాం. ప్రజలే నాకు బలం.. బలగం.
– వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే