హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బీజేపీకి ఏజెంట్‌గా మారాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ కనుసన్నల్లో, ఆ పార్టీ నేతల డైరెక్షన్లోనే రేవంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకీ బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నదని, ఇరుపార్టీల చీకటి ఒప్పందంలో భాగంగానే 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో శనివారం మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సుధీర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము ఆనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష పార్టీని బీఆర్ఎస్లో చేర్చటం ద్వారానే ఆ పార్టీ అధికారంలోకి రాలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 88 మంది ఎమ్మెల్యేలను గెలుచుకొన్న బీఆర్ఎస్ పార్టీ సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. తాము తమ నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రాజ్యాంగబద్ధంగా 10వ షెడ్యూల్ ప్రకారమే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేశామని వివరించారు. రేవంత్‌రెడ్డి బీజేపీతో చేతులు కలిపి కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు.
పార్టీల విలీనానికి తెరలేపిందే కాంగ్రెస్
పార్టీల విలీనానికి తెరలేపిందే కాంగ్రెస్ పార్టీ అని, ఆ సంస్కృతిని వికృతరూపంలో తమకు అనుకూలంగా మలచుకుంటున్నది బీజేపీ అని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆరోపించారు. రాజస్థాన్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకొని ఆనాడు చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇవ్వలేదా అని చురకలు అంటించారు. గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్న చరిత్ర బీజేపీదని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీలో చేర్చుకొని కేంద్రమంత్రి పదవి ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. సాక్షాత్తు ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో తమతో 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పిన విషయాలు వాస్తవాలు కావా? అంటూ ఆయా సందర్భాల్లో పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ప్రదర్శించారు.
బీజేపీ కుట్రలో భాగమే రేవంత్ ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీని రేవంత్ బీజేపీకి బీ టీమ్‌గా మార్చారని సుధీర్‌రెడ్డి విమర్శించారు. 12 మంది ఎమ్మెల్యేల కేసు కోర్టు విచారణలో ఉన్నా దానిని ఈడీ, సీబీఐకి అప్పగించాలనే బీజేపీ కుట్రలో భాగంగానే రేవంత్‌రెడ్డి వ్యవహరించారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతున్న సమయంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చోడో యాత్రను.. రాష్ట్రంలో కాంగ్రెస్ తోడో యాత్రను చేపట్టారని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో పట్టపగలు అడ్డంగా దొరికిన రేవంత్‌కు తమ విలీనంపై మాట్లాడే నైతికహక్కులేదని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు, ప్రలోభాల కోసం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌పార్టీలో రేవంత్ ప్రలోభాల కోసమే చేరితే తాము అందుకే విలీనం అయ్యామని చెప్పారు. తాము తమ ప్రజల అభీష్టం మేరకు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో విలీనం అయ్యామని, ఆ అభివృద్ధి తమ ప్రాంతాల్లో సాకారం అవుతున్నదని తెలిపారు.