హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని కోకాపేటలో నిర్మించబోయే గౌడ ఆత్మగౌరవ భవన నిర్మాణంలో అన్ని గౌడ సంఘాలకు ప్రాతినిధ్యం ఉంటున్నదని ఆబారీ, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం నగరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గౌడ కులస్థుల ఆత్మగౌరవ భవనానికి 5 ఎకరాల స్థలంతోపాటు భవన నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించారని వెల్లడించారు. భవన నిర్మాణంపై ఎలాంటి అపోహలు నమ్మవద్దని గౌడ సంఘాల నేతలను కోరారు.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ట్రస్ట్ / సొసైటీ డాక్యుమెంట్లు నకిలీవని.. వాటిపై ఎలాంటి సంతకాలు లేవని పేర్కొన్నారు. త్వరలో గౌడ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్, తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర ఉపాధక్ష్యుడు నాచగోని రాజయ్య గౌడ్, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల వేములయ్య గౌడ్, తెలంగాణ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, సంజయ్,కౌండిన్య సంఘం అధ్యక్షుడు కేఎల్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.