హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బండారం బట్టబయలైందా? రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ వేళ గుట్టురట్టయిందా? ఇప్పటికే రేవంత్‌రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరెక్షన్లోనే నడుస్తూ, బీజేపీతో అంతర్గత ఒప్పందం కుదుర్చుకొని.. కాంగ్రెస్‌లో ఉంటూ కమలం పార్టీకి మేలును భుజానికెత్తుకున్నారనే ఆరోపణ నిజమేనా! రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా సోమవారం జరిగిన పరిణామాలు ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి.
రేవంత్‌రెడ్డికి నమ్మిన వ్యక్తి, అక్కలా భావించే ఎమ్మెల్యే సీతక్క.. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో సొంత పార్టీ కాంగ్రెస్ మద్దతిచ్చిన యశ్వంత్‌సిన్హాకు కాకుండా, బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్టు ప్రచారం జరిగింది. యశ్వంత్సిన్హాకే ఓటు వేసినట్టు సీతక్క వివరణ ఇచ్చుకొన్నారు. కానీ, ఆదివాసీ బిడ్డ అయిన సీతక్క.. మరో ఆదివాసీ ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిగా ఎన్నుకొనే అరుదైన అవకాశం రావడంతో బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారని ప్రచారం జరుగుతున్నది. సీతక్కతోపాటు కాంగ్రెస్‌లోని మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ద్రౌపది ముర్ముకే ఓటు వేసినట్టు విశ్వసనీయ సమాచారం. రేవంత్‌రెడ్డి కూడా బీజేపీ అభ్యర్థికే ఓటు వేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో కుమ్మక్కైన రేవంత్‌రెడ్డి ఆ పార్టీకి మేలు చేసేందుకు తన అనుయాయులతో ఓట్లు వేయించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యశ్వంత్ సిన్హాను కలవని రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ మద్దతిచ్చిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా… ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 2న హైదరాబాద్‌కు వచ్చారు. ఆయనకు టీఆర్ఎస్ స్వాగతం పలికి, సభ నిర్వహించి మద్దతు ప్రకటించింది. రేవంత్‌రెడ్డి మాత్రం ఆయనను కలువబోమని బహిరంగంగానే ప్రకటించారు. యశ్వంత్ సిన్హాను కలిసిన ఆ పార్టీ సీనియర్ నేత వీ హన్మంతరావుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే ప్లాన్ ప్రకారమే కలవలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీతో వైరం పెట్టుకున్న చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నికల్లో చివరి నిమిషంలో ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. శిష్యుడైన రేవంత్‌రెడ్డి.. ఆయన సూచన మేరకే అంతర్గతంగా ద్రౌపది ముర్ముకు మద్దతు పలికారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీతక్క కూడా చంద్రబాబుకు నమ్మకస్తురాలు. ఈ నేపథ్యంలో సీతక్క ఓటుపై అనుమానాలు వ్యక్తమవడంపై ఆరోపణలకు బలం చేకూర్చుతున్నది.
నమ్మిన సిద్ధాంతం ప్రకారమే నడుస్తా: ఎమ్మెల్యే సీతక్క
బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తాను ఓటు వేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నట్టు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థికే ఓటు వేసినట్టు స్పష్టంచేశారు. నమ్మిన సిద్ధాంతం ప్రకారమే నడుచుకొంటానని, క్రాస్ ఓటింగ్ చేసే అలవాటు లేదని చెప్పారు. బ్యాలెట్ పేపర్లో పేర్లు ఉన్న చోట కాకుండా పైన ఇంక్ పడిందని, మరో బ్యాలెట్ పేపర్ అడిగితే, అధికారులు ఇవ్వలేదని తెలిపారు. దీంతో అదే బ్యాలెట్‌తో ఓటును వినియోగించుకున్నట్టు స్పష్టంచేశారు.