జగిత్యాల/ మెట్పల్లి, మే 19: జగిత్యాల జిల్లాలో అక్రమ మైనింగ్‌ను తక్షణమే ఆపి, ప్రజా సంపదను కాపాడాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల కోరారు. సోమవారం ఆయన కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. మెట్పల్లి-కమ్మర్పల్లి జాతీయ రహదారిపై మేడిపల్లి శివారులో రాత్రింబవళ్లు మట్టిని అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొందరు లూటీ చేస్తున్నారని తెలిపారు. తక్షణమే మైనింగ్ ఆపి, ప్రజల సంపదను కాపాడాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారికి ఇవ్వాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని కోరారు.
పచ్చిరొట్ట విత్తనాల ధరల పెంపుపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వానకాలానికి సంబంధించి విత్తనాల ధరలను ప్రభుత్వం రెట్టింపు చేసింది. జీలుగు, జనుము, పిల్ల్లిపెసర విత్తనాల పంపిణీ ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించింది. కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించి పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కేంద్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించేందుకు స్థానిక వ్యవసాయశాఖ అధికారులు సంజయ్ కల్వకుంట్లను ఆహ్వానించగా, అందుకు ఆయన తిరస్కరించారు. విత్తనాల ధరలను ప్రభుత్వం రెట్టింపు చేయడాన్ని నిరసిస్తూ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. రైతులు, వ్యవసాయం పట్ల కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.