Peddi | రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నేడు విడుదలై, బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకుపోతోంది. సమాజంలో వెనుకబడిన వర్గాల గుర్తింపు, క్రీడాకారుల ఆత్మగౌరవం వంటి ఒక అద్భుతమైన సామాజిక కథాంశంతో ఈ సినిమాను రూపొందించినప్పటికీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వివాదం కారణంగా ఈ చిత్రం హాట్ టాపిక్‌గా మారింది. కథలో మంచి సందేశం ఉన్నా, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మరియు సన్నివేశాల వల్ల సినిమా ఆత్మ దెబ్బతిందని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా చిత్రంలోని ఒక సన్నివేశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సీన్లో హీరో హీరోయిన్ను బలవంతంగా ముద్దుపెట్టుకోగా, ఆమె భయంతో, అవమానంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే, ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో లవ్ మ్యూజిక్ ప్లే చేయడం, పైగా హీరో తన ప్రవర్తనను సమర్థించుకోవడం వంటి అంశాలు వివాదానికి దారితీశాయి. దీనిపై నెటిజన్లు, పలువురు సినీ రివ్యూవర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అమ్మాయిల పట్ల జరిగే వేధింపులను, తప్పుడు ప్రవర్తనను ప్రేమగా చూపిస్తూ ఈ సీన్ ద్వారా గ్లోరిఫై చేశారని, ఇలాంటి ధోరణి సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని వారు ఆరోపిస్తున్నారు.
మరోవైపు, ‘దేవర’ సినిమా నుంచి ‘పెద్ది’ వరకు సౌత్ దర్శకులు జాహ్నవి కపూర్‌ను కేవలం ఒక గ్లామర్ డాల్లాగే వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక అథ్లెట్ కథలో కూడా ఆమె కాస్ట్యూమ్స్, కెమెరా యాంగిల్స్ ఆమె అందాల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చేలా ఉన్నాయని ప్రేక్షకులు అసహనం వ్యక్తపరుస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్, ఎమోషనల్ సీన్లు బాగున్నప్పటికీ… జాహ్నవి పాత్రను చూపించిన విధానం మరియు ఆ బలవంతపు ముద్దు సీన్ సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి. దీంతో ఆ వివాదాస్పద సీన్‌ను వెంటనే థియేటర్ల నుండి తొలగించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.