హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులను అక్కున చేర్చుకొని, నాణ్యమైన విద్యనందిస్తున్న గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్నదని మాజీ విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. గురుకులాల మీద అక్కసు వెళ్లగక్కడం మాని, వాటిని బలోపేతం చేయాలని ప్రభుత్వానికి మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు.
గురుకులాలతో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. రాష్ట్రంలోని 1200కుపైగా గురుకులాల్లో నాలుగు లక్షలకుపైగా విద్యార్థులు చదువుకుంటున్నారని, వారందనీ రోడ్డునపడేస్తారా? అని నిలదీశారు. సీఎం ఇలా మాట్లాడటమంటే పేద, బడుగు, బలహీనవర్గాలకు ద్రోహం చేయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణ గురుకులాలు ఆదర్శంగా నిలిచాయని, అనేక రాష్ర్టాలు వీటిపై అధ్యయనం చేస్తున్నాయని గుర్తు చేశారు. నేడు గురుకులాల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉన్నదని, సిఫారసు లేఖలు ఇచ్చినా సీట్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదని, ఇలాంటి గురుకులాలను నిర్వీర్యం చేస్తారా? అని ప్రశ్నించారు.
వారు నేడు జేఈఈ, నీట్లలో ర్యాంకులు సాధించి గొప్ప స్థానాలకు ఎదుగుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు 930 మంది డాక్టర్లు, 1,517 మంది ఇంజినీర్లుగా తయారయ్యారని, ఇది గురుకులాలు సృష్టించిన సంపద అని పేర్కొన్నారు. గురుకులాల్లోను అగ్రికల్చర్ కాలేజీ, రెండు లా కాలేజీలను తాము ఏర్పాటుచేశామని, ఇలాంటివి దేశంలో ఎక్కడాలేవని గుర్తుచేశారు. సాక్షాత్తు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇందుకు ప్రశంసలు కురిపించిందని తెలిపారు.