సవాల్ చేయడం, ఆ పై తప్పించుకోవడం బీజేపీ రాష్ట్ర నేతలకు పరిపాటిగా మారింది. బట్టకాల్చి మీద వేసే బాపతు ఆరోపణలపై ఎవరైనా చర్చకు సిద్ధపడితే.. బీజేపీ నాయకులు పరార్ అవుతున్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై చేసిన ఆరోపణల మీద ప్రమాణానికి రమ్మంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పలాయనం చిత్తగించారు. ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి రోహిత్‌రెడ్డి రాగా.. బండి, రఘునందన్ అక్కడికి రాకుండా ముఖం చాటేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కర్ణాటక పోలీసులు ఎవరూ తనను విచారించేందుకు పిలువలేదని, పిలిచినట్టు చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణానికి రాకుండా తప్పించుకొన్నాడని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి పలువురు నాయకులతో కలిసి వచ్చిన రోహిత్‌రెడ్డి బీజేపీ నేతల కోసం ఎదురుచూసినా ఎవరూ రాలేదు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధం అని, వేములవాడ లేదా తాండూరు భద్రేశ్వర స్వామి గుడికి రమ్మన్నా వస్తానని అన్నారు. బీజేపీ నేతలకు అబద్ధాలు చెప్పటం వెన్నతో పెట్టిన విద్య అని, బండి సంజయ్, రఘనందన్‌రావు చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను నిజమైన హిందువుగా అమ్మవారి సన్నిధిలో సవాల్ చేశానని, కానీ బండి సంజయ్ తన సవాల్ స్వీకరించకుండా ముఖం చాటేశాడని దుయ్యబట్టారు.
సంజయ్ ఆరోపణలు అవాస్తవాలని ప్రజలకు అర్థం అయ్యిందని, మతం పేరుతో రెచ్చగొడుతూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేంద్ర సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని, దర్యాప్తు సంస్థలతో విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పటాన్చెరులో పరిశ్రమల నుంచి వసూళ్లు చేయలేదా? వందల కోట్లు ఎట్ల సంపాదించినవ్ ? స్టార్ హోటళ్లలో ఏడాది పొడవునా గదులు ఉంచుకొనే స్థాయికి ఎలా ఎదిగినవ్ ? అని రోహిత్‌రెడ్డి నిలదీశారు. న్యాయం చేయాలని ఒక మహిళ నీ (రఘునందన్‌రావు) వద్దకొస్తే నాగుపాములాగా కాటేయ లేదా? డ్రగ్స్ కేసులో కొందరు నటులకు వకాల్తా పుచ్చుకొన్నది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు.