హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం వల్లే సోమారంపేట సర్పంచ్ ఆనందరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సర్పంచ్ తన నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారని, ఆయనను తానే దగ్గరుండి ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత ఆయన ఆనారోగ్యానికి గురయ్యారని, కిడ్నీలు ఫెయిలై, డయాలసిస్ చేయించుకునే స్థితికి చేరారని గుర్తుచేశారు. ఆనందరెడ్డి వైద్యానికి రూ.5 లక్షల ఎన్వోసీ కూడా ఇప్పించినట్టు తెలిపారు. తాను ఆనారోగ్యంతో బాధపడుతూ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతున్నాననే ఆవేదనతో సర్పంచ్ ఆత్యహత్య చేసుకున్నట్టు స్పష్టంచేశారు. కానీ అసలు విషయాన్ని దాచేసి శవాలపై రాజకీయం చేస్తారా అంటూ రసమయి ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధ్యతగల ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క పత్రికల కథనాల ఆధారంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం దారుణమని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వెంటనే భట్టి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పల్లె, పట్టణాల రూపురేఖలు మారాయి: ఎమ్మెల్యేలు వివేకానంద్, ఆల
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం అసెంబ్లీలో కేపీ వివేకానంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన ఎస్సార్డీపీ, ఎస్ఎన్డీపీ కార్యక్రమాలతో పట్టణాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. డ్రైనేజీ సిస్టం ఎంతో మెరుగైందని పేర్కొంటూ.. ఎస్ఎన్డీపీ రెండో దశను ప్రారంభించాలని కోరారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. 2014కు ముందు గ్రామాలు నరకానికి నకళ్లుగా ఉండేవని, ఇప్పడు సకల సౌకర్యాలతో కళకళలాడుతున్నాయని గుర్తుచేశారు.