Komatireddy Rajgopal Reddy | హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగనున్న నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హోంమంత్రిత్వ శాఖ అంటే ఇష్టమని స్పష్టంచేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో మంత్రి పదవిపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలన్న ఆయన, భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వహించినట్టు గుర్తుచేశారు. తనకు మంత్రి పదవి వస్తుందనే ఆశిస్తున్నట్టు తెలిపారు.
అసెంబ్లీ లాబీలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. ఒకరిపై ఒకరు చలోక్తులు విసురుకున్నారు. వివేక్‌ను ‘నమస్తే మంత్రి గారు’ అని మల్లారెడ్డి పలుకరించగా, దీనికి స్పందించిన వివేక్.. థ్యాంక్స్ మల్లన్నా అంటూ సమాధానమిచ్చారు. అనంతరం మల్లారెడ్డి.. రాష్ట్రంలో కోమటిరెడ్డి, వెంకటస్వామి ఫ్యామిలీల హవా నడుస్తున్నదని అన్నారు. వివేక్ స్పందించి.. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, మల్లారెడ్డిదే నడిచిందిగా.. అని జవాబిచ్చారు. దీనికి మేము అధికారం కోల్పోయాం.. మాదేం లేదన్నా అని మల్లారెడ్డి రిైప్లె ఇవ్వడంతో ఇద్దరి మధ్య నవ్వులు విరిచాయి.