నిజామాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణప్రతినిధి): సోయా కొనుగోళ్లపై సీలింగ్ విధించడాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. సోయా దిగుబడి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్లు వస్తుంటే ప్రభుత్వం 6 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటామనడం విడ్డూరమని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మిగతా పంటను అమ్ముకోవాలంటే రైతులు మళ్లీ ప్రైవేటు వ్యాపారుల చుట్టూ తిరగాల్నా? రూ.4,300లకే అమ్ముకోవాల్నా? అని ప్రశ్నించారు. ప్రభుత్వమే మొత్తం పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, అలాగే క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోయా మద్దతు ధర రూ.4,892 కాగా, బోనస్ కలిపి రూ.5,392 చొప్పున రైతుకు ఇవ్వాలని సూచించారు. ఎన్నికల ముందు ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్.. రైతుల పొట్ట కొట్టొద్దని హితవు పలికారు.
మీటింగ్‌కు రావొద్దనే..
నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రులు.. ప్రభుత్వ యంత్రాంగంతో నిర్వహించే సమీక్షకు సంబంధించిన సమాచారాన్ని సరిగా ఇవ్వలేదని వేముల తప్పుబట్టారు. సమాచారాన్ని ఆలస్యంగా ఇచ్చిన కారణంగా సమీక్షకు హాజరుకాలేని పరిస్థితిలో వేముల వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. శుక్రవారం మంత్రుల టూర్ ఉంటే, అదే రోజు కేవలం గంటల ముందే సమాచారం ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తాను మీటింగ్‌కు రావొద్దనే ఉద్దేశంతో ఇదంతా చేశారని మండిపడ్డారు. తన నియోజకవర్గ సమస్యలపై, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రశ్నిస్తాననే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.