చేర్యాల, అక్టోబర్ 10 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రిగా కేసీఆర్(KCR) పాలన సాగించిన సమయంలో అధ్యాత్మికత వెల్లివిరిసిందని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అలాంటి పరిస్ధితులు లేవని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(MLA Palla) అన్నారు. గురువారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చేర్యాల పట్టణంలోని దేవి స్నేహయూత్ నెలకొల్పిన అమ్మవారి మండపంలో దుర్గమాతను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం చేర్యాల కుడి చెరువు వద్ద బతుకమ్మ(Bhatukamma) ఏర్పాట్లు పరిశీలించి మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో దేవాలయాల అభివృద్ధి పాలకులు నిధులు మంజూరు చేయలేదని అదే కేసీఆర్ పాలనలో దేవాలయాలకు నిధులు మంజూరు చేసి భక్తులకు వసతులు కల్పించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మకు విడదీయరాని బంధం ఉందని, తొలి, మలి దశ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో గొప్పదని అన్నివర్గాలు ఎలాంటి భేషజాలు లేకుండా పువ్వులకు పూజలు చేసే పండుగ బతుకమ్మగా అభివర్ణించారు. బతుకమ్మ స్ఫూర్తితో చేర్యాల ప్రాంత వాసుల చిరకాల కోరికైన రెవెన్యూ డివిజన్ సాధించుకుందామన్నారు.