హుజూరాబాద్, జూలై 22 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఉదారత చాటుకున్నారు.ఈ నెల 15న హుజూరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన చిరు వ్యాపారులకు సోమవారం ఆర్థికసాయం అందజేశారు. ప్రమాదస్థలమైన పాపారావు బొంద వద్ద 31మంది బాధితులకు రూ.10 వేల చొప్పున రూ.3.10లక్షల చెక్కులను జీతంలోంచి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణాలు దగ్ధమై రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఒక్కో బాధితుడికి రూ.లక్ష పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వీణవంక మండలం మామిడాలపల్లి అనుబంధ గ్రామం గొల్లపల్లిలోని బ్రిడ్జ్ పూర్తిగా పాడైందని, మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వార్డు కౌన్సిలర్ కేసీరెడ్డి లావణ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.