హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని, ఎక్కడికక్కడ నిలదీయాలని గతంలో రేవంత్ చెప్పారని అందుకే తాను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను నిలదీశానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. రేవంత్‌రెడ్డి చెప్పినట్టే పార్టీ మారిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే తనపై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో వేయాలని రేవంత్‌రెడ్డి కుట్ర చేశారని మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, లీగల్‌సెల్ ప్రతినిధులు కల్యాణ్‌రావు, లలితారెడ్డితో కలిసి హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తనపై దాడిచేశారని కానీ, తానే దాడి చేసినట్టు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వీడియోను మీడియాకు చూపించారు.
తన నియోజకవర్గంలో రైతు రుణమాఫీ జరగలేదని, రైతు భరోసా రాలేదని, దళితబంధు ఇస్తలేరని ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రన్నింగ్ కామెంట్లు చేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావని ఎమ్మెల్యే సంజయ్‌ను ప్రశ్నించినట్టు చెప్పారు. ఈ క్రమంలో తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని వివరించారు. కేసీఆర్ లేకపోతే సంజయ్‌కుమార్ వార్డ్ మెంబర్‌గా కూడా గెలవలేరని అన్నారు.
గతంలో మంత్రిగా ఉన్న డీకే అరుణను టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి దూషించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తుంటే తనపై రేవంత్‌రెడ్డి సర్కారు 28 కేసులు పెట్టిందని మండిపడ్డారు. క్రిమినల్ కేసుల్లో రేవంత్‌రెడ్డి నంబర్ వన్ అని, ఆయనపై మొత్తం కేసులు 89 కేసులు ఉన్నాయని విమర్శించారు. అసలు రేవంత్‌రెడ్డిపై పీడీ యాక్టు పెట్టి లోపల నూకాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జూపల్లి, రేవంత్ మైకు గుంజుకున్నారని, కానీ ఇప్పుడు ఒకే గూటికి చేరారని విమర్శించారు.
భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి ఘటనపై కౌశిక్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘కేసీఆర్ ఫొటోను నేలకేసి కొట్టేందుకు ఎన్నిగుండెలు మీకు? కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? మీకు ఈ పదవులు దక్కేవా? ప్రజలు అంతా గమనిస్తున్నారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తారు’ అని పేర్కొన్నారు.