Nayini Rajender Reddy | నయీంనగర్, మే 5: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అనుచరులు మళ్లీ రెచ్చిపోయారు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ వద్ద వీధి వ్యాపారులపై విరుచుకుపడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇరవై ఏండ్లుగా రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ బతుకీడుస్తున్న చిరు వ్యాపారులపై సదరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగారు. ‘ఇక్కడ మా వాళ్లు డబ్బాలు పెట్టుకుంటారు.. మీరు సహకరించాలి.. లేకపోతే మీ దుకాణాలు పోతాయి’ అని హెచ్చరించారు. వీరి దౌర్జన్యంపై గత నెల 22న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితం కావడంతో కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్నారు.
అయితే ఆదివారం ఉదయం కొందరు ఎమ్మెల్యే అనుచరులు వచ్చి మహిళలు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు. ‘బీరు సీసాలు తీసి మేం నాయిని మనుషులం. ఎమ్మెల్యే పీఏ కిరణ్‌కు అన్ని తెలుసు. ఎవ్వనికి చెప్పుకుంటావో చెప్పుకో’ అంటూ ఇబ్బందులకు గురిచేసినట్టు బాధితులు తెలిపారు. ఈ క్రమంలో బాధితులు 100కు డయల్ చేయడంతో అక్కడికి చేరుకున్న హనుమకొండ పోలీసులు గొడవ చేస్తున్న వారితో.. ‘మీ తరఫున ఎమ్మెల్యే పీఏ కిరణ్ ఫోన్ చేశాడు.. మీరు ఇక్కడినుంచి వెళ్లిపోండి’ అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇన్ని ఇబ్బందులు పెడుతుందని అనుకోలేదని, ఇప్పటికైనా నాయకులు, అధికారులు ఆలోచించి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు వేడుకుంటున్నారు.